ప్రస్తుత సాంకేతక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో కన్నబిడ్డలను కన్నవారు ,కన్నవార్ని కన్నబిడ్డలు గాలికి వదిలేసి తాము బాగుంటే చాలు అనుకుంటున్న సమయంలో ఒక తండ్రి తన తనయుడు కోసం ఎవరు చేయలేని సాహసం చేశాడు .తండ్రి అనే పదానికి నిజమైన నిర్వచనం చెప్పాడు .సాధారంగా ప్రతి నాలుగు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి ‘ఫ్యాన్కోని ఎనీమియా’ తన కుమారుడికి రావడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. దీంతో తనయుడిని కాపాడుకోవడానికి తిరగని గుళ్లు లేవు, ఎక్కని ఆస్పత్రి మెట్లు లేవు.ఎవరు కనికరించకపోయే సరికి చివరికి తన మూలకణాన్ని దానం చేసి మరోసారి పునర్జన్మ ప్రసాదించాడు విశ్వనాథరాజు. వ్యాధిని జయించిన ఆ కుమారుడి పేరు హనీశ్ వర్మ(4). ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్‌వీకే విశ్వనాథరాజు సంగారెడ్డిలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. రెండేళ్ల కిత్రం తన కుమారుని శరీరంపై ఎర్రటి మచ్చలొస్తే.. చికెన్ ఫాక్స్ అన్న అనుమానంతో ఆస్పత్రిలో చేర్పించారు.
చికిత్స అందించినా తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైంది. ఇంకో ఆస్పత్రి తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ పరీక్షలు.. మందులు.. చికిత్స. అయినా తగ్గలేదు. చివరికి హైదరాబాద్‌లోఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే చిన్నారి రక్తస్థాయులు బాగా పడిపోయాయి. ఎంతో హుషారుగా ఉండే హనీశ్.. తెలియని వ్యాధితో నరకం అనుభవిస్తుంటే ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈసారి పరీక్షల్లో హనీశ్‌కు అప్లాస్టిక్ ఎనీమియా వచ్చినట్లు తేలింది. అదే సమయంలో జన్యుపరంగా సోకే అత్యంత అరుదైన ‘ఫ్యాన్కోనీ ఎనీమియా’ కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఫ్యాన్కోని ఎనీమియా అంటే ఎముకలో ఉండే మూలుగులోని రక్తకణాలు క్రమంగా చనిపోవడం. చికిత్స చేయడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు.
పైగా నాలుగేళ్ల వయసులో అంటే ఎంతో కష్టం. హనీశ్‌కు మరణం తప్పదని అంతా భావించారు. ఈ క్లిష్టమైన కేసును నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రి సవాల్‌గా స్వీకరించింది. ఈ వ్యాధికి మూలకణాలతో చికిత్స చేస్తే బాగవుతుంది. కానీ, డేటా బ్యాంకులో ఎవ్వరి మూలకణాలతోనూ హనీశ్‌కు సరిపోలేదు. తండ్రి విశ్వనాథ్ మూలరక్తకణాలతో ప్రయత్నం చేయగా అవికూడా సగమే సరిపోయాయి. వాస్తవానికి 100శాతం రక్తకణాలు ఉంటేనే శస్త్రచికిత్స విజయవంతం అవుతుంది. చివరి ప్రయత్నంగా సగం సరిపోయిన మూలరక్తకణాలతోనే చిన్నారికి మార్పిడి చేశారు. అయితే ఇక్కడ కూడా కొన్ని సంక్ష్లిష్టమైన సమస్యలు ఎదురయ్యాయి. తండ్రి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కాగా హనీష్ ది ఏ పాజిటివ్.