ఎమ్మెల్యే చెరువు కబ్జా నిజమే అంటూ ఓ పత్రిక లో వచ్చిన వార్త లో ఎలాంటి నిజం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు కబ్జాను నిర్దారించడానికి ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని స్పష్టం చేశారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆఖిల క్షం కమిటీ సూచన మేరకే స్థానికుల సౌకర్యం కోసం చెరువు అభివృద్ధి చేశామన్నారు. చెరువు విస్తీర్ణం తగ్గలేదు ఇంకా పెరిగిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివరించారు.
చెరువులోకి వస్తున్న డ్రైనేజీని దారిమాళ్లించేందుకే పైప్ లైన్ వేశామని తెలిపారు.
శాసనమండలిలో రెవెన్యూ మంత్రి మెహమూద్ అలీ చెరువు విస్తీర్ణంపై స్పష్టమైన సమాచారమిచ్చారని ముత్తిరెడ్డి తెలిపారు. కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. చెరువు సుందరీకరణను మంత్రులు హరీష్ రావు,కడియం శ్రీహరి మెచ్చుకున్నారని గుర్తు చేశారు. పనులు తొందరగా పూర్తి కావాలని సీఎం గారు కూడా ఆదేశించారని తెలిపారు. సిద్ధిపేటలో కోమటి చెరువు తరహాలో జనగామ చెరువు అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన అని వివరించారు. కలెక్టర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో ఇప్పటికే సీఎస్ కు పిర్యాదు చేశామని అన్నారు. కలెక్టర్ కు అనుభవరాహిత్యం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన ఆక్షేపించారు.
చెరువు వల్ల జనగామ మునగదని ముత్తిరెడ్డి తెలిపారు. కొందరు ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా పని చేస్తున్నారని ఆక్షేపించారు.చాలా మంది ఆధికారులను పని చేయకుండా కలెక్టర్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఒకవేళ ఈ విషయంలో తప్పు ఉంటే ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవచ్చునని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. దేశంలో కుంభకోణాలు లేకుండా పాలన సాగుతున్నది తెలంగాణాలోనే అయినప్పటికీ…తాను కూడా ప్రభుత్వంలో భాగమని కలెక్టర్ గుర్తుంచుకోవాలని అన్నారు. నిపుణుల కమిటీ చెరువు కబ్జాను తేల్చిందని తప్పుడు సమాచారం ఇచ్చిన వారి గురించి ప్రభుత్వం విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Post Views: 191