ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు కల్పించకపోయినా పర్వాలేదు.. విద్యార్థుల ర్యాంకులు మెరుగుపరిస్తే చాలు అన్న చందాన కార్పొరేట్ కళాశాలలు వ్యవహరిస్తుండటం కూడా ఆత్మహత్యలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని, కనీసం చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కడుపుశోకం మిగుల్చుతున్న కార్పొరేట్ కళాశాలలపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే, ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు సర్కార్.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
కాగా, తాజాగా విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు సర్కార్ ఓ నివేదికను విడుదల చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యం తీరు కారణం కాదని, ర్యాంకుల కోసం తల్లిదండ్రుల ఒత్తిళ్ల వల్లే బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటూ ఆ నివేదికలో పేర్కొంది. అలాగే ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత సమస్యలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమంటూ నివేదికలో వెల్లడించింది చంద్రబాబు సర్కార్.
చంద్రబాబు సర్కార్ విడుదల చేసిన ఈ నివేదికపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలకు చంద్రబాబు వంత పాడుతున్నారన్న మాటకు ఈ నివేదికే నిదర్శనమని అంటున్నారు. ఓ వైపు నారాయణ కళాశాలల అధినేతను మంత్రిని చేసి నారాయణ కళాశాలలను పెంచి పోషిస్తున్న మీరు ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ కళాశాలలకు వంత పాడటంపై పెదవి విరుస్తున్నారు ప్రజలు. ఏదేమైనా కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేసి.. వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారన్న నిపుణుల వాదనలను చంద్రబాబు బుట్టదాఖలు చేసిందని విమర్శిస్తున్నారు కార్పొరేట్ కళాశాలల బాధితులు.
అయితే, స్వయాన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నారాయణ కళాశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని మీడియా సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు సరిగ్గా కల్పించడం లేదని, దీంతో విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడితోపాటు మౌలిక సౌకర్యాల ఒత్తిడి కూడా ఉందన్నారు. మీడియా ముందు నారాయణ కళాశాలలపై ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకుంటామని ప్రగల్బాలు పలికిన మంత్రి గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు వరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నారాయణ కళాశాలల అధినేత, మంత్రి నారాయణ స్వయానా మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు కావడమే ఇందుకు కారణమా? లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు కావడమా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తాజాగా ఈ విషయమై పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. ఏపిలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు 20 రోజుల్లో 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు కేంద్రాలుగా మారిన నారాయణ, చైతన్య విద్యా సంస్థలను మూసివేస్తూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.