దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారు కొంతమంది బీజేపీ నేతలు.ఈ క్రమంలో మహారాష్ట్ర జల సంరక్షణ మంత్రి రామ్ షిండే రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తూ వీడియోకి చిక్కారు. ఆదివారం రోజు ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమైంది. సోలాపూర్ – బార్సి రోడ్డు మీదుగా మంత్రి తన కారులో వెళ్తుండగా ఈ పని చేశారు. దీని గురించి ఆయనను వివరణ అడగ్గా… గత నెల రోజులుగా జలయుక్త శివార్ పథకం గురించి తీవ్రంగా కష్టపడుతున్న కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని, కారులో వెళ్తున్నపుడు తనకు జ్వరంగా కూడా ఉందని, ఆ కారణంతో పాటు రోడ్డు మీద టాయ్లెట్ కనిపించకపోవడంతో అక్కడే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందని సంజాయిషీ ఇచ్చారు.అయితే దీనిపై ప్రతిపక్ష ఎన్సీపీ మాత్రం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైవే రోడ్ల మీద టాయ్లెట్లు లేకపోవడం ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ పనితనమని అవహేళన చేసింది.
