ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రలో బాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వరాల జల్లు కురిపించారు. సన్న, చిన్నకారు కుటుంబీకులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం హుసేనాపురంలో మహిళా సదస్సు నిర్వహించారు. మహిళా సదస్సుకి చుట్టుపక్క గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్.. మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పిల్లలను బడికి పంపితే ఏడాదికి 15వేలు ఇస్తామని.. ఇంజినీరింగ్, మెడిసిన్‌ను ఉచితంగా చదివిస్తామని.. హాస్టల్ ఫీజు కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామని… అధికారంలోకి వస్తే పెన్షన్లను 2 వేలకు పెంచుతామని… పెన్షన్‌దారుల వయసు 45 ఏళ్లకు తగ్గిస్తామని… పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని జగన్ వరాలు కురిపించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అవస్థలు పడ్డారని.. ఇకనైనా ప్రజలు మేల్కొని.. మీ చేతిలో ఉన్న పవర్‌ను ఉపయోగించుకొని సరైన నాయకుడ్ని ఎన్నుకోండని జగన్ సూచించారు.
అన్నం పెట్టే రైతులకు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్ అన్నారు. వ్యవసాయం కోసం.. నగలు తాకట్టు పెట్టి బ్యాంకుల నుండి అప్పలు తీసుకున్న వారికి.. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని.. టీడీపీ అధికారంలోకి రావడానికే బాబు అడ్డమైన హామీలిచ్చారని జగన్ ఫైర్ అయ్యారు. ఇక జన్మభూమి కమిటీల్లాగా కాక గ్రామాలలో సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సెక్రటేరియట్‌లలో ఆయా సామాజిక వర్గాల నుంచి పది మంది ఉద్యోగులను కేటాయిస్తామని.. వారే దగ్గరుండి ప్రజల సమస్యలు నెరవేరుస్తారని చెప్పారు. పొదుపు సంఘాల అప్పును నాలుగు కంతులలో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మద్యాన్ని నిషేధిస్తామన్నారు. ఈ హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే మళ్లీ ప్రజల మద్దతు అడుగుతానని చెప్పారు. దీంతో జగన్ పాదయాత్రలో బాగంగా కర్నూలులో వరాల జల్లు కురిపించారని.. ఇక వైసీపీని ఆపడం కష్టమని.. రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.