తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, సాహితీ మూర్తులు ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటిచెప్పాలని కోరారు. సాహిత్య సృజన, సాహిత్య పటిమపై ఈ సమావేశాల్లో చర్చ జరగాలని, సాంస్కృతిక కార్యక్రమాలకు, కళలకు తగిన ప్రాధాన్యం ఉండాలని సూచించారు. మహాసభల విజయవంతానికి పట్టుదల, సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇంటర్ వరకు తెలుగు కచ్చితమనే నిబంధనకు సర్వత్రా ఆమోదం లభించిందని, తెలుగు భాషలో అభ్యసించిన వారికి ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తామని చెప్పారు. అమ్మను కాపాడుకున్నట్లే.. తెలుగును కాపాడుకోవాలన్నారు. మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని స్వాగత తోరణాలతో అలంకరించాలి. తెలుగు పద్యాలు, సాహిత్యం వినిపించాలి. భాగ్యనగరం భాసిల్లేలా తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాట్లు చేయలన్నారు. వచ్చిన అతిథులకు మంచి వసతి, భోజనం కల్పించాలి. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరినీ ఆహ్వానించాలి. నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రక్రియను ఒక్కో వేదికలో ప్రదర్శించాలి. తెలుగు మహాసభల సందర్భంగా తెలుగుకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే విశ్వాసం కలిగించాలని అన్నారు .