ఏపీ రాష్ట్రంలో నెంబర్ వన్ క్రిమినల్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అని వైసీపీ నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షు డు అంబటి రాంబాబు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటూ టీడీపీ నాయకులు ప్రదర్శన నిర్వహించటాన్ని ఆయన ఖండించారు. కోడెల ఇంట్లో బాంబులు పేలి మనుషులు చనిపోయారని, ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక సమయంలో వైసీపీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా పట్టపగలు దాడి చేసి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి ఎన్నిక చేసుకున్నారన్నారు. కోడెలపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో ప్రజలకు తెలుసునని, చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్నుపోటుతో వాటిని ఎత్తి వేశారని అన్నారు. సత్తెనపల్లిలోని క్లబ్ ప్రభుత్వ ఆస్తి అయితే ప్రతి వాదులైన ఐదుగురు అధికారులు కోర్టులో దానిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆస్తి అని మున్సిపల్ చైర్మన్ రామస్వామి, టీడీపీ త్రయం చెప్పటానికి బుద్ది ఉందా అని ప్రశ్నించారు. కోడెల ఆదేశాలతోనే క్లబ్ మూయించామని చెబుతున్నారని, దానిపై కోడెలకు ఏం హక్కు ఉందన్నారు. క్లబ్ కార్యదర్శిగా ఉన్న నాగుర్‌మీరాన్ వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడని, రాజకీయంగా ఆయనను దెబ్బ తీసేందుకు చేస్తున్న కుట్రను తిప్పికొడతామన్నారు.పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రయివేటు ఆస్థులను దోపిడీ చేస్తారా అని ప్రశ్నించారు. గొడుగుల సుబ్బారావు ఆస్థి కాజేసినట్లు క్లబ్‌ను కాజేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పోలీసులు తమ లాఠీలను క్రిమినల్స్‌పై ప్రయోగించాలన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పోలీసుల ఉద్యోగాల ను ఎవరూ కాపాడలేరని, చట్టాన్ని చదివి వ్యవహరించాలని హితవు పలికారు. కేసులను తట్టుకుంటామని, తప్పడు కేసులు, రౌడీషీట్లు తెరిస్తే పోలీసులపై ప్రయివేట్ కేసులు వేయటానికి కూడా వెనుకాడ బోమని అంబటి స్పష్టంచేశారు