ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది.
ఆదివారం ఏపీ రాజధాని అమరావతిలో సోషల్ మీడియా సమ్మిట్-2017 జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, టాలీవుడ్ హీరో రానా, సంగీత దర్శకుడు అనిరుధ్, షార్ట్ ఫిల్మ్ హాస్యనటుడు వైవా హర్షలకు అవార్డులు అందజేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అక్కడే సమస్య మొదలైంది. ఏపీ నిర్వహించిన కార్యక్రమం కాబట్టి టాలీవుడ్ నటులకు ఇవ్వాలికానీ, బాలీవుడ్ నటికి ఎలా ఇస్తారంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఈ విషయంపై నెటిజన్లు సైతం ఘాటుగానే విమర్శిస్తున్నారు. తాజాగా దీపిక నటించిన పద్మావతి సినిమా వివాదాల్లో ఉంది. అలాంటిది ప్రత్యేకంగా దీపికకు అవార్డు ఇవ్వడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో దీపిక స్థాయిలో ఎవరూ కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నంది అవార్డుల వివాదంలో సతమతమౌతున్న ప్రభుత్వానికి, మంత్రి అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు