తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగి నీటి విడుదలపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి రిజర్వాయర్ కారణంగా భవిష్యత్‌లో సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టమవుతున్న నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి మూసీ కాల్వ ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను తీసుకొచ్చి ఎడమకాల్వ ద్వారా రెండు పంటలకు నీరందించే బృహత్తర పథకానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. ప్రస్తుతం మేజర్ కాల్వలకు డిజైన్ డిచ్చార్జి మేరకే నీటి విడుదల ఉంటుందన్నారు. కాల్వ చివరి భూములకు సైతం నీరందించడమే ప్రధాన లక్ష్యమని, దీంతో ఇక ఎడమకాల్వ పరిధిలో టేలాండ్ భూములు ఉండవన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవడం ద్వారా చివరి భూములకు అందే విధంగా సహకరించాలని సూచించారు. ఎడమ కాల్వకు సాగునీటి తేదీల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నలమోతు భాస్కర్‌రావు, ఎన్నెస్పీ సీఈ సునీల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు గౌరవ్ ఉప్పల్, సురేంద్రమోహన్, జేడీఏ నర్సింహారావు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.