ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు మరో పది రోజుల గడువు ఉన్నప్పటికీ…దేశ విదేశాలకు చెందిన వక్తల్లో ఈ సదస్సు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు..సమ్మిట్‌లో పాల్గొనే వక్తల నుంచి మొదలుకొని హాజరయ్యే వారి వరకు ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్నారు. సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరవుతున్న అగ్రరాజ్యధిపతి ట్రంప్ కుమార్తె ఇవాంకా దాదాపు 14 రోజుల ముందే..తన ఆసక్తిని ట్వీట్ రూపంలో పంచుకున్న సంగతి తెలిసిందే. ‘హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో జరుగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సదస్సులో పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని గత మంగళవారం ఆమె ఉత్సాహంగా ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఆవిష్కర్తలు పాల్గొనే సదస్సులో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొనబోతున్నానని ఇవాంకా ట్రంప్ సంతోషం పంచుకున్నారు. రెండు వారాల్లో భారత్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలువబోతున్నానని వెల్లడించారు.
ఈ ట్వీట్‌కు స్పందనగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘హైదరాబాద్ వేదికగా సాగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ ద్వారా…అమెరికా-భారత్‌ల మధ్య బంధం బలపడుతుందని ఆశిస్తున్నాను.` అని ట్వీట్ చేశారు. కలారి క్యాపిటల్‌కు చెందిన వాణికోలా అయితే తన ఆత్మీయ అనుబంధాన్ని ట్వీట్ రూపంలో పంచుకున్నారు. ‘జీఈఎస్2017కు హాజరు అవడం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. మా హైదరాబాద్‌లో ఇది జరగడం సంతోషకరం. మా సొంత నగరంలో జరగడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
వాణి కోల ట్వీట్ పట్ల మంత్రి సైతం హర్షం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్‌కు స్వాగతం వాణిగారు’ అని మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన స్మితా పాండే మిశ్రా ట్వీట్ చేస్తూ ‘జీఈఎస్‌కు ఆహ్వానం అందడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సంతోషం వ్యక్తం చేస్తున్నాం’ అని తన ఆనందాన్ని పంచుకున్నారు. సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ సైతం జీఈఎస్‌ను ప్రశంసించారు. అమెరికా,భారత్‌ల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఈ జీఈఎస్ వేదికగా నిలుస్తుందని అన్నారు.
Post Views: 685