హైదరాబాద్ అభివృద్ధి కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఇందులో భౄగంగా తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి మహ్మమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీ బండారు దత్తాత్రేయ మరియు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల అమలపై సమీక్షించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు, ఇప్పటికే మల్కాజిగిరి నియోజకవర్గ సమీక్ష నిర్వహించినట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, వాటి పురోగతిపై మంత్రి ప్రజా ప్రతినిధులకు వివరాలు అందజేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయా కార్యక్రమాలను మంత్రి వివిరించారు. జిహెచ్ఎంసి పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగంగా లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు మరింత చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపిక చేసిన అన్ని సైట్లలో పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని లేకుంటే వాటి స్ధానంలో అనుకూలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మిస్తామన్నారు. సమావేశంలో నాలా విస్తరణ మరియు అభివృద్ధి, జలమండలి కార్యక్రమాలు, ఏస్సార్డీపి ప్రాజెక్టులు, రోడ్డు విస్తరణ మరియు జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు నిర్మాణము, పార్కుల అభివృద్ధి, ఎల్ఈడీ లైట్ల బిగింపు వంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు నగర పారిశుద్యం, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ శాఖ, రెవెన్యూశాఖలకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలను కాపాడేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని మంతత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో ఒక సమావేశాన్ని త్వరలో ఏర్పాటుచేసి, ఖాళీ స్థలాల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. నాళాల విస్తరణకు సంబంధించిన త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ చేపడతామని, ఇందుకోసం వందమంది సిబ్బందిని టౌన్ప్లానింగ్ విభాగానికి అందించనున్నట్లు మంత్రి తెలిపారు. నాళాల విస్తరణ, పూడికతీత, వాటి అభివృద్ధి వంటి అంశాలపైన ప్రజాప్రతినిధుల నుంచి పలు సలహాలు మంత్రి తీసుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో రైల్వే శాఖ, రక్షణశాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాల పైన వారితో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించిన, నగరాలు లేదా దేశాలను అధ్యయనం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పర్యటనకు వెళ్లి రావాల్సిందిగా మంత్రి కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను కొనసాగిస్తామని, ప్రతి మూడు నెలలకోసారి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Post Views: 210