ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల పంట భూములను తీసుకున్నారు. రాజధాని సేకరణకు గుంటూరు జిల్లాలో సేకరించిన భూములన్ని కూడా పచ్చని పంట పొలాలతో కళకళలాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంటలు పండేవి. రాజధానికి భూముల సేకరణ విషయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు.
అయితే వాస్తవానికి ఇప్పటకీ తాత్కాలిక సచివాలయం మాత్రమే పూర్తయ్యింది. యేడాది కాలంగా రాజధాని కోసం డిజైన్లు అంటూనే కాలం గడిపేస్తున్నారు.రాజధాని కోసం నానా హడావిడి చేసి రైతుల నుంచి తీసుకున్న పంట భూముల్లో ఇప్పుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన గేదెలు ఎంచక్కా గడ్డి మేస్తున్నాయి. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు మన కాంట్రవర్సీ కింగ్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రభాకర్ తన ఊళ్లో ఉన్న పశువుల కొట్టంలోని 118 గేదెలను తీసుకువచ్చేశారు. ప్రస్తుతం రాజధాని కోసం సేకరించిన వేలాది ఎకరాల భూముల్లో పచ్చగడ్డి అలాగే ఉండడంతో ఆ భూముల్లో ప్రభాకర్ గేదెలు ఎంచక్కా గడ్డి మేస్తున్నాయి. ఈ తంతు రెండు నెలలుగా సాగుతోందట.
విప్ ప్రభాకర్ తన గేదెలు రాజధాని భూముల్లో ఎంచక్కా గడ్డి మేసేందుకు వీలుగా పనివాళ్లను, దొడ్డిని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. ప్రభాకర్ గేదెలు ఎంచక్కా అమరావతి భూముల్లో గడ్డి తిని అక్కడ కాల్వల్లో ఉంటోన్న నీరు తాగుతున్నాయి. ఇదేంటి తమనుంచి రాజధాని సేకరణకు తీసుకున్న భూముల్లో ఈ గేదెలను ఎలా మేపుతున్నారని స్థానిక రైతులు వాళ్లను ప్రశ్నిస్తే, ఇవి విప్ ప్రభాకర్ గారి గేదెలు, ఆయన ఆదేశాలతోనే తాము వీటిని ఇక్కడ మేపుతున్నట్టు చెప్పారు. ఇక అమరావతి భూముల్లో చంద్రబాబు భవనాలు ప్రస్తుతానికి భ్రమగా మిగిలిపోతే, రాజధాని కోసం విలువైన భూములు ఇచ్చిన రైతులు బాధపడుతుంటే.. టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మాత్రం ఎంచక్కా తన గేదెలను మేపుకునేందుకు వీటిని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.