ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్య వివాదాస్పదంగా మారింది. కర్నూలు జిల్లాలో పలువురు నేతలకు గన్ మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా వైసీపీ నేతలైన శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలకు గన్ మెన్లను పూర్తిగా తొలగించింది. అలాగే టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు గన్ మెన్లను తగ్గించింది. శిల్పా సోదరులు ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పరిణామంపై ఆయన మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుందని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. వైసీపీ నేతలు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, మాజీ జడ్పీ చైర్మన్ నాగిరెడ్డి గన్‌మెన్లను తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షనేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవుపలికారు. అభివృద్ధి ద్వారా ప్రజల్లో ఆదరణ పొందాలే తప్పించి….పక్షపాత చర్యలతో కాదని ఆయన స్పష్టం చేశారు