వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దుమ్మురేపడంతో టీడీపీ బ్యాచ్‌కి అప్ అండ్ డౌన్ అదిరిపోతోంది. ఇప్పటికే టీడీపీ పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత జగన్ పాదయాత్రలో బహిర్గతం అవుతోంది. దీంతో టీడీపీ బ్యాచ్ మైండ్ బ్లాక్ అవ్వగా.. తాజాగా కర్నూలు గడ్డ పై టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ రామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగన్ చేపట్టిన పాదయాత్రలో భాగంగా.. శనివారం బనగానపల్లె నియోజకవర్గం చేరుకున్న జగన్ సమక్షంలో రామిరెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతే కాకుండా డాక్టర్ రామి రెడ్డితో పాటు కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు నాయక్ కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి బనగానపల్లెలోని ప్రజా సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎర్రబోతుల వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.