ఏపీ రాజధాని అమరవతిలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లును తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు కదా, ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బదులిస్తూ నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ రాజధాని నిర్మాణం చేపడతామని ఒక సవివర నివేదిక(డీపీఆర్)ను సంబంధిత మంత్రిత్వశాఖకు ఇచ్చిందని, దాన్ని తూచా తప్పక పాటించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలిపారు.