ఇవాళ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ , డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరితో కలిసి వరంగల్ నగరంలో ఉదయం నుంచి రూ.వంద కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసారు . ఈ క్రమంలో హన్మకొండ కాకతీయ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలోమంత్రి కేటీఆర్ మాట్లాడుతూ …ప్రభుత్వం చేయాలనుకుంటోన్న అభివృద్ధి పనులన్నింటికీ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుతు ఇచ్చే ప్రయత్నం చేద్దామన్నా, ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇద్దామన్నా, ప్రాజెక్టులు కడదామన్నా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని అన్నారు.
తెలంగాణకు దరిద్రంలా పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పటికీ అడ్డుపడుతున్నారని కేటీఆర్ అన్నారు . తమకు బాస్‌లు ఢిల్లీలో ఉండేవారు కాదని, గల్లీల్లో ఉండే ప్రజలే తమకు బాస్‌లు అని కేటీఆర్ అన్నారు. ఏ సర్వే చేసినా కేసీఆర్ నెంబర్ 1 ముఖ్యమంత్రి అని తేలుతోందని పేర్కొన్నారు . రోడ్డుపై ఏనుగు పోతోంటే కుక్కలు మొరుగుతుంటాయని వాటిని పట్టించుకోవద్దని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చేస్తోన్నటువంటి ధర్నాలు, ఆందోళనలను చాలా చూశామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను జైలుకి కూడా వెళ్లానని తెలిపారు. ఆ రోజు తాము ప్రజల మద్దతుతో ఉద్యమాలు చేశామని చెప్పారు. పసలేని, పనిలేని దద్దమ్మలకు తాము జవాబుదారులం కాదని వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కితేనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు.