తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో 326 చెక్కులు మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
మంత్రి హరీష్ రావు పర్యటనలో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలం కొత్తూరు(డి) గ్రామ ప్రజలు అధికార టీఆర్‌ఎస్ పార్టీ వైపు నిలిచారు. టీఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందంటూ నినదించారు. గ్రామస్తులమంతా.. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. 1200 మంది జనాభా.. 800 ఓటర్లున్నా ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించాలని మంత్రి హరీష్‌రావుకు ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల ప్రతిపాదనకు హరీష్‌రావు అంగీకారం తెలిపారు. అయితే సర్పంచ్‌ను మాత్రం ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి పెట్టిన షరతుకు కొత్తూరు(డి) గ్రామస్తులు ఒప్పుకున్నారు. సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ. 15 లక్షలు ఇస్తామని హరీష్‌రావు హామీనిచ్చారు.కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఫారురుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే గీతారెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.