నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో మాట్లాడలేని కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు కేటాయించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.