ఎస్టీల విద్యుత్ బకాయిలు, విద్యుత్ కేసులన్నీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. రూ. 70 కోట్లకుపైగా ఉన్న విద్యుత్ బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించామని… 40 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాలని సీఎం ఆదేశించారు. మిగితా రూ. 30 కోట్లను ట్రాన్స్‌కో మాఫీ చేస్తుందని జెన్‌కో – ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చారు. ఎస్టీలపై పెట్టిన విజిలెన్స్ కేసులు ఎత్తివేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతీ ఎస్టీ ఇంటికి రూ. 125 మాత్రమే తీసుకొని కరెంటు కనెక్షన్ ఇవ్వాలని… ప్రతీ ఇంటికి సర్వీస్ వైరు, వైరింగ్, రెండు లైట్లు ఏర్పాటు చేయాలని… 50 యూనిట్ల లోపు కరెంటు వాడుకునేవారికి ఎలాంటి ఛార్జీ తీసుకోకూడదని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 9,737 ఎస్టీ ఆవాస ప్రాంతాలుండగా… 8,734 గ్రామాల్లో త్రీఫేజ్ కరెంటు లేదని… సమైక్య రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికి ఇదొక ఉదాహరణ అని సీఎం ఉద్ఘాటించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్న వారితో సహా ఎస్టీ వ్యవసాయదారులందరికీ… విద్యుత్ సర్వీసు సౌకర్యం కల్పించి… ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.రెసిడెన్షియల్ పాఠశాలల వల్ల ఎస్టీ పిల్లలకు ఎంతో మేలు కలుగుతున్నదని… ఈ పాఠశాలల్లో ప్రవేశానికి విపరీతమైన డిమాండ్ ఉన్నందున మరికొన్ని పాఠశాలలు ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్టీల స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇందుకోసం పథకాల రూపకల్పన చేయాలన్నారు.
అన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాలకు ఖచ్చితంగా రోడ్డు సౌకర్యం కల్పించే విషయంలో అధికారులతో సమన్వయం చేసుకోవడానికి సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. విద్య, స్వయం ఉపాధి విషయాల్లో సమన్వయానికి ఎంపీ సీతారాం నాయక్ నాయకత్వంలో కమిటీ, విద్యుత్‌కు సంబంధించిన అంశాలను సమన్వయం చేయడానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నాయకత్వంలో కమిటీని సీఎం నియమించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, నగేశ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్… ఎస్టీలకు కూడా గొర్రెల పెంపకం లాంటి స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తామన్నారు.