తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేనేత మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో నేతన్నల తలమారలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి కృషి చేస్తుందని ఉద్ఘాటించారు. నేతన్నల్లో మనోైస్థెర్యాన్ని నింపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి చేనేత, జౌళి రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు.
భూదాన్‌పోచంపల్లి, సిరిసిల్ల నేతన్నలను ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. చేనేత రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 1283 కోట్లు కేటాయించారని చెప్పారు. చేనేత కార్మికుల దగ్గర నుంచే స్కూల్ యూనిఫామ్స్ కొంటున్నామని పేర్కొన్నారు. యూనిఫామ్స్ కొనుగోలు కోసం విద్యాశాఖ రూ. 90 కోట్లు కేటాయించిందని తెలిపారు. అంతే కాదు.. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇచ్చే చీరలు, అంగన్‌వాడీలకు ఇచ్చే చీరలు, కేసీఆర్ కిట్లలో భాగంగా ఇచ్చే దుస్తులను చేనేత కార్మికులకే ఆర్డర్స్ ఇచ్చామని గుర్తు చేశారు.
నేత కార్మికుల ఆత్మహత్యలు ఆపేందుకు అన్నివిధాలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా చేనేత రంగంలో నాలుగు వేల కుటుంబాలకు వ్యక్తిగత రుణమాఫీ చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేశామన్నారు.