కోడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ లో చేరి రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రమని… రేవంత్ ను ఆ పార్టీ నేతలు ఎదగనిస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలో రేవంత్ కు ఒక పదవి ఉండేదని, ఒక ఆఫీస్, ఒక ఛాంబర్ ఉండేవని… రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా పర్యటించి, తన గళం వినిపించే స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ జిల్లాల్లో పర్యటించగలరా అని ప్రశ్నించారు .
