చిత్రం: ఖాకీ
నటీనటులు: కార్తి.. రకుల్ ప్రీత్,అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లిష్ విల్సన్..
సంగీతం: జిబ్రాన్
ఎడిటింగ్: శివ నందీశ్వరన్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
నిర్మాత: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు.. ఎస్.ఆర్.ప్రభు
దర్శకత్వం: వినోద్
సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుదల తేదీ: 17-11-2017
ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన కానీ లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తనకే సాధ్యమైన వినూత్న కథలతో ఇటు సినిమా ప్రేక్షకులను అటు తన అభిమానులను పలకరించే నటుల్లో ఒకరు కార్తి ..అప్పట్లో ఎప్పుడో వచ్చియన్ యుగానికొక్కడు మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉంది. గతేడాది ఉపిరి, కాష్మోరా చిత్రాలతో అలరించిన ఆయన ఇప్పుడు ఒక సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 90దశకంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం తీరన్ అధిగారమ్ ఒండ్రు.ఇక్కడ మాత్రం ఖాకీ అనే పేరుతో విడుదలైంది. మరి పోలీసు అధికారిగా కార్తి ఎలా నటించారు? దోపిడి దొంగల ముఠా ఆగడాలకు ఎలా అడ్డుకట్టవేశారు?గతంలో వచ్చిన పోలీసు చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉందా?.అనే అంశం పై ఒక లుక్ వేద్దాం ..
కథేంటంటే: పోలీసు డిపార్ట్మెంటులో ఓ డీఎస్పీగా అడుగుపెడతాడు ధీరజ్ కుమార్(కార్తి). చాకచక్యంతో నేరస్తుల ఆట కట్టిస్తూ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. తన నిజాయతీ, నిక్కచ్చితనం వల్ల తరచూ బదిలీలు జరుగుతుంటాయి. ఎన్నో కేసులను సమర్థంగా ఛేదించిన ధీరజ్‌కు ఓ దోపిడీ కేసు సవాల్‌గా మారుతుంది. హైవేల పక్కనున్న ఇళ్లలోకి చొరబడి దోపిడీలకు పాల్పడి, దారుణంగా హత్యలు చేస్తుంటుంది ఓ ముఠా. వాళ్లను పట్టుకునే బాధ్యత ధీరజ్‌కు అప్పగిస్తారు ఉన్నతాధికారులు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాలు తిరుగుతూ.. దోపిడీలు చేస్తున్న ఆ ముఠాను పట్టుకునేందుకు ధీరజ్ అతని బృందం ఏం చేసింది? ప్రియ(రకుల్)ను ప్రేమించి పెళ్లిచేసుకున్న ధీరజ్.. తన కుటుంబ జీవితంలో ఏం కోల్పోయాడు? తదితర విషయాలతో సినిమా సాగుతుంది.
ఎలా ఉందంటే:
లేటెస్ట్ రోజుల్లో ఎవరైతే క్రైమ్ లాంటి నేపథ్యం ఉన్న చిత్రాలను ఆదరిస్తారో వారికి ఈ మూవీ నచ్చుతుంది .మూవీలో ఒక కరడుగట్టిన ముఠాను అంతం చేయడమే లక్ష్యంగా పోలీసు బృందం చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను సహజంగా తెరకెక్కించారు. తెరపై తరచూ కనిపించే పోలీసులతో పోలిస్తే పూర్తి భిన్నమైన పోలీసు కథ ఇది. ఎక్కడా వీరోచిత విన్యాసాలు కనిపించవు. తెరపై నిజ జీవితాలను, నిజమైన పోలీసులను చూస్తున్నట్లే ఉంటుంది. 1985 నుంచి 2005 మధ్య కాలంలో 45కు పైగా దోపిడీలకు పాల్పడి, 18 హత్యలు చేసి, 64మంది జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఓ నిజమైన ముఠా చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ కథ కోసం దర్శకుడు చేసిన పరిశోధన ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. ఆ ముఠా నేపథ్యం గురించి తెరపై చూపించిన వైనం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, శత్రువులను వేటాడటమే కథ కాబట్టి, ఇందులో ఊహించని మలుపులు అంటూ ఉండవు. దాంతో అక్కడక్కడా సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. బన్నే సింగ్, ముఠాలో చదువుకున్న నాయకుడిని అరెస్టు చేసే విధానం ఉత్కంఠను కలిగిస్తుంది. ముఠా నాయకుడు ఓమా (అభిమన్యుసింగ్)ను పట్టుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. యాక్షనే ఈ సినిమాకు ప్రధాన బలం.
ఎవరెలా చేశారంటే:
ధీరజ్ కుమార్ పాత్రలో హీరో కార్తి ఒదిగిపోయాడు. మేకప్ లేకుండా ప్రతి సన్నివేశంలోనూ సహజంగా కనిపించాడు. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం చాలా బాగుంటుంది. ప్రియగా గృహిణి పాత్రలో రకుల్ అభినయం ప్రేక్షకులకు కొత్తదనం పంచుతుంది. అభిమన్యు సింగ్ చూపులతోనే పాత్రను రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. సాంకేతికత సినిమా స్థాయిని పెంచింది. ఎక్కువగా 90వ దశకంలో సాగే కథ కాబట్టి, సన్నివేశాలకు ఆ కలర్‌ను తీసుకొచ్చిన విధానం సహజంగా ఉంది. సత్యన్ సూరన్ కెమేరా పనితనం , జిబ్రాన్ నేపథ్య సంగీతం చక్కగా కుదిరాయి. అయితే పాటలే సాదాసీదాగా అనిపిస్తాయి. సుబ్బరాయన్ యాక్షన్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది.
మూవీ బలాలు
+ కథ
+ కార్తి నటన
+ యాక్షన్ సన్నివేశాలు
మూవీ బలహీనతలు
– అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు
రేటింగ్ : 2.75/5
దరువు పంచ్ లైన్ : ఉత్కంఠ రేకెత్తించే ఒక సరికొత్త కొత్త పోలీసు కథ.
