వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సెంచురీ దాటి డబుల్ సెంచురీ వైపుగా దూసుకుపోతుంది. నవంబర్ 6న ఇడుపులపాయ నుండి ప్రారంభమైన ఇచ్ఛాపురం వరకు దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పాదయాత్రలో భాగంగా జగన్ డైరీ రాస్తున్నారని సమాచారం.
జగన్ పాదయత్రకి మొత్తం ఏడు నెలల సమయం పట్టనుంది. ఇప్పటికే పాదయాత్ర పది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో పాదయత్రలో ఎదురవుతున్న ప్రతి అంశాన్ని జగన్ డైరీలో పొందుపరుస్తున్నారని తెలుస్తోంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పాదయాత్రకు బయలుదేరే జగన్ రాత్రి 7.30 గంటలకు బసకు వెళతారు. బసకు చేరుకోగానే అల్పాహారం తీసుకుని, పాలు తాగిన తర్వాత జగన్ ఒక గంట సేపు డైరీ రాస్తారని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.
ఇక ఆ డైరీలో జగన్ తాను పాదయాత్రను ఏ ప్రాంతం నుంచి ఆరోజు ప్రారంభించింది.. ఎక్కడెక్కడకు వెళ్లింది.. ఎన్ని కిలోమీటర్లు పర్యటించిందీ రాస్తున్నారట. అంతేకాదు తనను ఎవరెవరు కలిశారు.. వారి సమస్యలను కూడా జగన్ నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తాను స్వయంగా వింటున్న సమస్యలను మ్యానిఫేస్టోలో పెట్టాలన్నది జగన్ ఆలోచనట. అందుకోసమే ప్రతి సమస్యనూ డైరీలో రాస్తున్నారు.
అంతేకాదు ఏ నియోజకవర్గంలో రెస్పాన్స్ వచ్చింది.. ఏ నేతలు అక్కడ కష్టపడి పనిచేస్తున్నారన్నది కూడా డైరీలో చోటుచేసుకుంటున్నాయట. దీంతో జగన్ డైరీ రేపటి ఎన్నికల్లో కీలకం కానుంది. ఇటు మ్యానిఫేస్టో రూపకల్పనలోనూ, అటు సీట్ల కేటాయింపులోనూ డైరీయే కీలకమవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జగన్ పాదయాత్ర చేయడం.. పజల సమస్యల్ని కళ్ళారా చూసి.. విని.. ఆ అనుభవాలను ఒక డైరీలో రాసుకుని వాటిని అమలు చేసేదిశగా ప్రణాళికలు రచించండం శుభపరిణామం అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు.