పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు.
తెలుగుదేశం తరుపున ప్రజా సమస్యలపై ఏ మాత్రం పోరాడుతారో తెలీదుకాని.. ఇరిగేషన్‌శాఖ ప్రాజెక్టులను దక్కించుకోవడంలో మాత్రం అందరినీ తొక్కేస్తూ ముందుకుపోతారు సీఎం రమేష్. దాదాపు 3వేల కోట్ల పనులు చేతిలో పెట్టుకున్న ఈ పొలిటిషన్ కమ్ కాంట్రాక్టర్ వాటిని పూర్తి చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతుంటారు. సబ్ కాంట్రాక్టర్‌లను ముంచేస్తుంటారు. లేటెస్ట్‌గా పోలవరం పనులపైన కూడా దృష్టి పెట్టారు. ఈ వ్యవహారంపై సీఎం ఓ కన్నేయకపోతే పోలవరం వ్యవహారం మరో టీడీపీ అక్రమార్జనగా మారిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఓ వైపు ఏపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకుంటూనే.. మరో పక్క ప్రాజెక్టుల నిధులను పక్కదారి పట్టుస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ జోక్యంతో కాంట్రాక్ట్‌లు పొందుతున్న సంస్థలు పనులు పూర్తి చేయలేక చేతులెత్తేస్తున్నాయి. పెద్దల ఆశీస్సులతో నిబంధనలను అనుకూలంగా మార్చుకుని టెండర్లు దక్కించుకుంటున్న సంస్థలు లక్ష్యాలకు మాత్రం ఆమడ దూరంలో ఉంటున్నాయి. ఈ వరుసలో ముందుగా అందరూ ప్రస్తావించేది సీఎం రమేష్ సంస్థల గురించే
అసలు విషయానికొస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో.. చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా టీడీపీ నేతలు కోటాను కోట్లు ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేతలు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులు రాజ్యసభ సభ్యుడు, ఎంపీ సీఎం రమేష్‌కు కేటాయించడం జరిగింది. హంద్రీనీవాలోని పది ప్యాకేజీల పనులు, అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రమేష్ సంస్థలకే అప్పగించారు సీఎం చంద్రబాబు. అంతేకాక, గాలేరు నగరి ఫేజ్ – 1లో రెండు ప్యాకేజీల విలువ రూ.40కోట్ల అంచనా వ్యయం ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు కాంట్రాక్టును అప్పగించగా.. ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. ఈ పనులకు సంబంధించి ప్రస్తుత అంచనా విలువ రూ.100 కోట్లకు పెరిగిందంటూ సీఎం రమేష్ ప్రభుత్వానికి మళ్లీ బిల్లు పెట్టడం గమనార్హం. సీఎం రమేష్ సంస్థకు కేటాయించిన రూ.120 కోట్ల వంశధార ప్రాజెక్టు పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. గుత్తి – తాడిపత్రి నేషనల్ హైవే పనులలతోపాటు గండికోట ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ పనులను కూడా చంద్రబాబు సర్కార్ సీఎం రమేష్‌కే కేటాయించడం గమనార్హం.
సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలు అంతటితో ఆగడం లేదు. 60సీ నిబంధన కింద టీడీపీ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టులను చేజిక్కించుకున్న వారిని బెదిరించి మరీ కాంట్రాక్టులను తన సంస్థకే వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు. కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎం రమేష్ సంస్థలు పనులను పూర్తి చేస్తున్నాయా..? అంటే అదీ లేదు. సీఎం రమేష్ తీరుపై టీడీపీలోనూ తీవ్ర అసంతృప్తి ఉండటంతో ఇప్పటికైనా సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలపై దృష్టి సారించాలని టీడీపీ నేతలే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు పోవడం గమనార్హం. ఏదేమైనా ఎంపీ సీఎం రమేష్ తీరు ‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’ అనే రీతిలో ఉందని టీడీపీ నేతలే అంటున్నారు.