శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ సంపదకు తెలంగాణే జన్మభూమి అని తెలిపారు. తెలుగులో సాహిత్య ప్రక్రియకు తెలంగాణే ఆదిగా నిలిచిందన్నారు. సోమన సాహిత్యమే తెలుగు భాషకు ఆదిగా నిలిచిందని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారిందని చెప్పారు. సురవరం ప్రతాపరెడ్డి 354 మంది తెలంగాణ కవుల రచనలను ప్రచురించారని గుర్తు చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలో జరుగుతాయని సీఎం ప్రకటించారు. సభల సందర్భంగా నగర వ్యాప్తంగా తోరణాలు, ద్వారాలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొనడానికి జాతీయ నాయకులు వస్తారని చెప్పారు. అతిథి మర్యాదల్లో తెలంగాణ వైభవాన్ని చాటేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. తెలుగు మహాసభల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
