మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ముగ్గురు కామాంధులు పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత మూడు నెలలుగా ఈ దారుణం జరుగుతోంది. మౌనంగా ఉన్న బాలికను ఆమె తల్లి ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భోపాల్‌కు చెందిన బాలిక (10) అయిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతంలో వాచ్‌మెన్‌గా పనిచేసే నన్హు లాల్(65).. జ్ఞానేంద్ర పండిట్ (36), గోకుల్ పన్వాలా(45)తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. స్వీట్ ఆశగా చూపి బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో గత మూడు నెలలుగా ఈ దారుణం జరుగుతున్నా బాలికకు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. చివరిసారిగా ఈ నెల 12న బాలికపై మరోసారి వీరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే, కొన్నిరోజులుగా ముభావంగా ఉన్న కూతురిని చూసి తల్లి ఆమెను ప్రశ్నించింది. చివరికి అసలు విషయాన్ని ఆమెకు చెప్పడంతో పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. వారిపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
