తెలంగాణ రాష్ట్రంలో షీటీమ్స్ ఏర్పాటు ద్వారా ఈవ్ టీజింగ్, ఈవ్ టీజర్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు గొంగిడి సునిత, శోభ అడిగిన ప్రశ్నలకు హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి సభలో సమాధానమిచ్చారు. మహిళల భద్రతే ప్రభుత్వ బాధ్యత అని మంత్రి నాయిని స్పష్టం చేశారు.ప్రస్తుతం 210 షీటీమ్స్ పని చేస్తున్నాయని.. ఒక షీ టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు 4260 మందిని ఈవ్ టీజింగ్ కేసు కింద అరెస్ట్ చేశామని.. 9743 మంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఆత్మరక్షణ కోసం యువతులకు శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈవ్ టీజర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు.. సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్ట్ చేస్తారని మంత్రి వెల్లడించారు.బస్టాండ్, విద్యాసంస్థల ప్రదేశాల్లో షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. మహిళలకు భద్రత విషయంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందన్నారు.