‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. నీ భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మంచిర్యాల పట్టణానికి చెందిన కేసిరెడ్డి మోహన్‌రెడ్డి-పద్మ దంపతుల కుమారుడు రామకృష్ణారెడ్డికి, సమీపంలోని ఊరు శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి-అరుణ దంపతుల కూతురు విజ్జూలతకు 2012లొ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో విజ్జూలత కుటుంబం రూ.15లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు బాగానే చేశారు.
కూతురు పుట్టిన ఏడాది నుంచి విజ్జూలతకు అత్తమామలు, ఆడపడుచు నుంచి అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. చీటికిమాటికీ సూటిపోటి మాటలతో మనసు బాధపెట్టడం, భర్త ముందే అవమానించేలా మాట్లాడటం.. ఇంత జరుగుతున్నా.. భర్త నోరు మెదకపోవడం ఆమెను తీవ్రంగా కలత చెందేలా చేసింది.ఆపై వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో విజ్జూలత ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. ఆత్మహత్యకు ముందు భర్త రామకృష్ణారెడ్డికి విజ్జూలత ఫోన్ ద్వారా సమాచారం అందించి..సుసైడ్ నోట్ రాసింది.
సూసైట్ నోట్: ‘బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.’ ‘ఆమెకు ఇష్టం లేకపోతే వచ్చేదాన్ని కూడా ఇలాగే టార్చర్ చేస్తారు. నిన్ను కూడా టార్చర్ చేస్తారు. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కావడం. ఇది కూడా మీ అమ్మకు ఇష్టం లేదు. ఆమెకు ఎన్ని పనులు చేసినా అంతే.. గిన్నెలు కడగకపోతే పోలీస్ ఆంటీ ఇంటికి పోయి చెప్పుతుంది. అన్ని పనులూ చేసి ఒకనాడు కడుపునొస్తుందని కూర్చున్నా..’ ‘ఆ ఒక్కరోజే గిన్నెలు కడగలేదు. నువ్వు మీ అమ్మ మాట దాటకు సరే. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మీ నాన్నకేమో ఇంకా కట్నం కావాలని ఉంది. మీ అమ్మానాన్నలకు మా నాన్నంటే ఇష్టం లేదు. అందుకే నా మీద పగ తీర్చుకుంటున్నారు. నా కూతురు తల్లిలేని పిల్ల కావద్దనే ఆమెను కూడా చంపేస్తున్నా. నువ్వు మీ అమ్మానాన్నలతో.. ముఖ్యంగా మీ అక్కతో సంతోషంగా ఉండు. పెళ్లి అయినప్పటి నుంచి నీవు రూ.7 వేలు శాలరీ కింద పనిచేస్తున్నావు. నేను చనిపోగానే.. నీకు మీ అమ్మ నాన్న, అక్క శాలరీ పెంచుతారు’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.