ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులపై ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన ప్రశ్నలపై మంత్రి హరీష్ సమాధానమిచ్చారు.ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కింద మునుగోడులో 10,270.. నల్లగొండలో 24,468… నకిరెకల్లో 62476.. తుంగతుర్తిలో 2784 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ హయంలో పథకం పనులు నిర్లక్ష్యంగా జరిగాయన్నారు.
దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల అనుసంధానం, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 107 పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానమిచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీఓనెం 107ను 2015లో జారీ చేసిందని.. కాంగ్రెస్ సభ్యులు చెప్పినట్లు 2017లో కాదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దిండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం రాజకీయాల కోసమేనని హరీశ్ రావు మండిపడ్డారు. దిండి నుంచి అచ్చంపేటలో 14,430 ఎకరాలకు, కల్వకుర్తిలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసింది కాంగ్రెస్ నేతలేనని మంత్రి ఈసందర్భంగా గుర్తు చేశారు.