ఏపీ సర్కార్ తెలుగు చలన చిత్రానికి సంబందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డులు ప్రకటించింది. వరుసగా 2014,15,16 సంవత్సరాలకు గానూ ప్రకటించిన నంది అవార్స్‌లో విషయంలో పెద్ద దుమారమే చెలరేగుతోంది.ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు.
తాజాగా నంది అవార్డుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి తీరని అన్యాయం జరిగిందని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ సన్నిహితుడిగా వున్న బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మెగా హీరోలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసి కొత్తగా నటన నేర్చుకోవాలా.. చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ తీసుకోవాలా.. అంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో మెగా హీరోలకు ఒక అవార్డు కూడా రాలేదనే ఆగ్రహం స్పష్టంగా తెలుస్తోంది.
ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారన్నాడు. రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని ప్రశ్నించాడు. ఇది ముమ్మాటికీ మెగా ఫ్యామిలీని అవమానించడమేనని అన్నాడు. మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పట్టించుకోలేదని, కానీ ఆవేదనతోనే తాను ప్రశ్నిస్తున్నానని వ్యాఖ్యానించాడు.మగధీర సినిమాకు కూడా గతంలో తీరని అన్యాయం జరిగిందని… జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు వాపోయాడు.
ఈ మూడేళ్ల అవార్డుల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని… చిరంజీవి కుటుంబానికి గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతోందని చెప్పాడు. గత పదిహేనేళ్లుగా సినీ పరిశ్రమకు 50 శాతం ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోందని తెలిపాడు. దీనిపై నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ స్పందించాలని కోరాడు. ఇక మరోవైపు రుద్రమదేవికి కూడా ఒక్క నంది అవార్డు రాకపోవడంతో డైరెక్టర్ గుణశేఖర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడయాలో పోస్టు పెట్టారు. మరోవైపు తాజాగా డైరక్టర్ మారుతీ కూడా ట్విట్టర్‌లో సొంతవారికి అవార్డులు ఇస్తున్న ఒక టీవీ కామెడీ వీడియోని పెట్టి తన వ్యతిరేకతను ప్రకటించారు.