తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ గళం విప్పారు. అవార్డులు స్వీకరించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పటికీ… మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాన్ క్లేవ్ 2017 లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ – స్వచ్చతా విభాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ ల మంత్రి కె. తారక రామారావు, పర్యావరణ – అటవీ శాఖల మంత్రి జోగు రామన్న ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇండియాటుడే నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ఉపరితలరవాణా, జల వనరుల శాఖ మంత్రికి మంత్రి కే తారక రామారావు పలు విజ్ఞప్తులు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లే, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ లలో ఏదో ఒక ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు మంత్రి తెలిపారు. 50 ఏళ్లలో జాతీయ రహదారుల అభివృద్ధికి బాటలు పడలేదని, కానీ మూడేళ్లలో కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు దాదాపు 3 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేశారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ ల మంత్రి కె. తారక రామారావు కృతజ్ఙతలు తెలిపారు.