తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ప్రత్యేకమైన రికార్డు ఇది. మరే రాజకీయ నాయకుడికి కూడా సొంతం కానీ ప్రత్యేకమైన అంశం ఇది. ఇంతకీ ఏంటా విషయం అంటారా? క్రేజీ పొలిటీషియన్లుగా యూత్‌లో ఆదరణ పొందిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు యువతలో పిచ్చి క్రేజ్ ఉన్న సెల్ఫీల స్టార్లుగా కూడా మారిపోయారు.
సాధారణంగా సెలబ్రిటీలు, క్రికెటర్లు కలిసినప్పుడు యూత్ సెల్ఫీలు తీసుకునేందుకు తెగ ముచ్చట పడుతుంటారు. అయితే రాజకీయ నాయకుల్లో ఆ క్రేజ్‌ను కలిగించేలా చేసింది…ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది మంత్రి కేటీఆర్ అనడంలో సందేహం లేదు. అది హైదరాబాద్ అయిన..జిల్లాల్లో ప్రోగ్రాం అయినా…ఐటీ కారిడార్ అయినా…అడ్డగుట్టలో కార్యక్రమం అయినా యువత పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీలకు ఆసక్తిచూపిస్తుంటారు. దానికి తగినట్లుగానే కేటీఆర్ సైతం సమయం కేటాయిస్తుంటారు.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి క్రేజీ రిక్వెస్ట్‌లే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వస్తోంది. ప్రజా సంకల్ప యాత్ర రూపంలో పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా విద్యార్థులు, యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెరసి యాత్రలో జగన్ సైతం సెల్పీలకు టైం కేటాయిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ర్టాల్లో ఇటు మంత్రి కేటీఆర్, అటు జగన్ కు మాత్రమే ఇలాంటి విశేషమైన ఆదరణ దక్కుతోందని అంటున్నారు.