ప్రముఖ రచయితన దర్శకుడు విలక్షణ నటుడు పోసాని మురళికృష్ణ మీడియాకి ఎక్కారంటే ఆ వారమంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి వైరల్గా మారిపోతుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవిని పోసాని ఏ రేంజ్లో తిట్టారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతకి మురళి చూపించిన చుక్కలు ఇప్పటికీ అందరు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు. పోసాని అంటే అంత సెన్షేషన్.
ఇప్పుడు మరోసారి పోసాని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో భాగంగా.. పోసాని మాట్లాడుతూ నేను చచ్చిపోయేంతవరకు జగన్కు మాత్రమే ఓటేస్తానని చెప్పి మరోసారి వార్తల్లోకెక్కారు. అంతే కాకుండా ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే సమర్థుడని పేర్కొన్నారు.
అయితే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా.. వారిపై ఎందుకు దృష్టిపెట్టరని.., యాంకర్ ప్రశ్నించగా నేను ఒక నాయకుడిని అభిమానించేటప్పుడు ఆయనకు మాత్రమే ఓటు వేస్తాను.. మిగతా ఎవ్వరికి నా ఓటు వెయ్యను.. మన ప్రజాస్వామ్యంలో రెండు ఓట్లు వేసే వెసులుబాటు లేదు అలాంటప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి గురించి ఆలోచిస్తానే తప్పా మిగతావాళ్లు గురించి నేను ఆలోచించనని తేల్చి చెప్పారు.
ఇక మరో ప్రశ్నగా వైసీపీ నుండి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు… నాకు నేనుగా వెళ్ళి జగన్ని ఏ సీటూ అడగను.. ఒకవేళ వాళ్లు ఇస్తామన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేసే స్థోమత తనకు లేదని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చి.. మీరు ఈ పదవిని నిర్వహిచండి అని అడిగితే అప్పడు ఆలోచిస్తానని చెప్పారు. దీంతో ఇప్పుడు పోసాని కృష్ణమురళి టాక్ ఆఫ్ది పాలిటిక్స్ అయ్యారు.