కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌పై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ సందర్భంగా సంపత్ కుమార్ ఆ విషయంపై మాట్లాడకుండా.. సంబంధం లేని విషయాలను ప్రస్తావనకు తెచ్చారు. 2016-17 ఏడాదికి గానూ వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ఫస్ట్ క్వార్టర్ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని లోక్ సభలో కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ చెప్పారని గుర్తు చేస్తూ.. ఆ స్టేట్‌మెంట్‌ను ఇంగ్లీష్‌లో చదివి వినిపించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు సంపత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సంపత్ స్పందిస్తూ.. ఫీజు రియింబర్స్ మెంట్ కు సంబంధించిన అంశమే తాను ప్రస్తావిస్తున్నాను అని తెలిపారు. తాను ఇంగ్లీష్‌లో చెబితే సభ్యులకు అర్థం కావడం లేదేమో అని సంపత్ వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. సంపత్ అంత స్వీపింగ్‌గా మాట్లాడొద్దు. ఇంగ్లీష్ అర్థం కాకపోతే అనే పదం ఏంటి చెప్పండి? అని ప్రశ్నించారు. ఇక్కడ కూర్చుకున్న వారికి ఇంగ్లీష్ అర్థం కాదా? మీకే ఇంగ్లీష్ అర్థమైతదా? మీరు ఒక్కరే ఇంగ్లీస్ నేర్చుకున్నారా? అని ప్రశ్నించారు కడియం శ్రీహరి. సంపత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కడియం అన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ అన్ని వర్గాలకు సంబంధించిన విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగానే బలహీన వర్గాల సంక్షేమంపై చిత్తశుద్ది ఉంటే ప్రత్యేకంగా చర్చకు రండి అని సూచించారు.