ఇవాళ శాసనసభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై లఘు చర్చ జరుగుతున్న సందర్భంగా.. కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి అడ్డుకున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా.. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు జయంతిపై చర్చ చేపట్టాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు . బాలల దినోత్సవం రోజున తెలంగాణ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వారికి విద్యాఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం చేపడితే.. కాంగ్రెస్ దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల మీద గతంలో ఎన్నడూ చర్చ చేపట్టలేదని మంత్రి గుర్తు చేశారు. నిరసన తెలిపితే అర్థం ఉండాలన్నారు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు . బయటనేమో ఉద్యోగాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తారు.. తీరా చర్చ చేపడితే అడ్డుకుంటారని మంత్రి కోపోద్రిక్తులయ్యారు. సభలో చర్చకు సహకరించి మీ అభిప్రాయాలను చెప్పాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందనే అక్కసుతోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చకు కాంగ్రెస్ అడ్డుపడుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు.