కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలకు చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల రూపురేఖలను మార్చి తన ఖాతాలో వేసుకునే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పోనీ పేరు మార్చిన కేంద్ర ప్రథకాల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయా? అంటే అదీ లేదు. వాటి ఫలితాలను కేవలం టీడీపీ కార్యకర్తలకు దక్కేలా ముందస్తు ప్రణాళికలను రచిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. దీంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలితాలతోపాటు.. నిధులు కూడా టీడీపీ నాయకుల జేబుల్లోకి చేరుతున్నాయి.
పై వ్యాఖ్యలకు నిదర్శనంగా కృష్ణా జిల్లా విజయవాడలో ఇటువంటి సంఘటనకే పాల్పడింది టీడీపీ.
కాగా, వ్యాపారులకు సులభంగా రుణాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా పేరుతో ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని తన వశం చేసుకునే పనిలో పడింది చంద్రబాబు సర్కార్. అనుకున్నదే తడవుగా.. అంతే వేగంతో కార్యాచరణను అమలు చేసి ముద్రా పథకాన్ని కాస్తా.. విజయవాడ అర్బన్ టీడీపీ ముద్రాగా పేరు మార్చేసింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు కూడాను. ఈ వెబ్‌సైట్‌ను సాక్షాత్తు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించడం గమనార్హం.
అయితే, కేంద్ర పథకాన్ని టీడీపీ తన ఖాతాలో వేసుకోవడానికి వెనుక అసలు కారణమేమిటంటే..!
టీడీపీ కార్యకర్తలకు మాత్రమే ముద్రా రుణాల అందేలా చూడటమే చంద్రబాబు సర్కార్ ప్రధాన ఉద్దేశం. ఈ వెబ్‌సైట్ ద్వారా ముందుగానే టీడీపీ నాయకులతో రుణాలకు దరఖాస్తు చేయించి, వారికి మాత్రమే రుణాలు వచ్చేలా బ్యాంకు అధికారులపై ఒత్తిడి తేవాలన్నది ఉద్దేశంగా కనిపిస్తోంది. అటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు అందక.. ఇటు కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు అందక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సామాన్యులు.