ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే ఆపుకోవాల్సి వస్తుందని వాపోయారు. ఉపకార వేతనాలు రెండేళ్లుగా అందడం లేదని, హాస్టళ్లు మూసి వేస్తున్నారని, మెస్ చార్జీలు చెల్లించడం లేదని వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధలు చెప్పుకున్నారు. పీఆర్‌సీ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, బదిలీలు చేపట్టాలని మొరపెట్టుకున్నారు. అలాగే స్థానికులు తమకు పింఛన్లు అందడం లేదని, రేషన్‌కార్డులు, జాబు కార్డులు ఇవ్వడం లేదని, పక్కా ఇల్లు పచ్చ చొక్కాలకే మంజూరు చేస్తున్నారని వైయస్ జగన్‌కు చెప్పారు. వీరి సమస్యలను ఓపికతో విన్న ప్రతిపక్ష నేత త్వరలోనే మంచి రోజులు వస్తాయని అందరికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా కల్పించారు.
