కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా.. 17 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరిని స్థానికులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి పవిత్రసంగమం వద్దకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది ఒంగోలుకు చెందిన వారే.
ఏం జరిగిందంటే….
ఒంగోలు వాకర్స్ క్లబ్‌కు చెందిన బృందం 60 మంది రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అమరావతికి ఆదివారం ఉదయం వచ్చారు. ఇక్కడ పలు ప్రదేశాలను సందర్శించిన తర్వాత విజయవాడలోని పున్నమిఘాట్‌కు వారు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలో పవిత్రసంగమం వద్ద నిత్యహారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు. అప్పటికే సాయంత్రం 4.30 కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో ఏపీ పర్యాటకశాఖకు చెందిన పడవ రాదని సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న ప్రైవేటు సంస్థ రివర్ బోటింగ్ అండ్ అడ్వంచర్స్‌కు చెందిన పడవను మాట్లాడుకున్నారు. ఈ పడవకు కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతే లేదు. దానిలో 20 మందిని కూడా ఎక్కించడానికి వీలులేకపోయినా.. ఏకంగా 38 మందిని ఎక్కించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్ నుంచి పవిత్ర సంగమం వద్దకు అది బయలుదేరింది. సాయంత్రం 5.20 గంటల సమయానికి పవిత్ర సంగమం సమీపానికి చేరుకుంది. అక్కడ సరిగ్గా గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే ప్రాంతంలోకి పడవ చేరుకోగానే.. ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. అది దాటి కొంచెం ముందుకు వెళ్లగానే.. నదిలో ఇసుక మేటలు ఉన్నాయి. పడవ ఒక వైపునకు కొంచెం ఒరిగింది. పర్యాటకులు భయంతో మరోవైపునకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్ పడవను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అది బోల్తా పడింది. ఈత వచ్చినవాళ్లు కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. మరికొందరు పడవను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు. ఇదే సమయంలో నిత్యం కృష్ణా నదిలో సహాయక చర్యల కోసం ఉండే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే అక్కడకు చేరుకుని కొందరిని రక్షించాయి. ఇలా మొత్తం 15 మంది బయటపడ్డారు. ప్రమాద స్థలంలోనే 11 మంది మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఐదుగురు చనిపోయారు. మిగతా వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యక్తులు, పర్యాటక శాఖలోని కొందరు అధికారులే నేరుగా వ్యాపారం మొదలు పెట్టేశారు. పర్యాటన శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ శాఖపై పట్టు సాధించలేకపోవడంతో ఇదే అదునుగా అధికారులు, ఇద్దరు మంత్రులు కృష్ణమ్మపై వీర వీహారం చేస్తున్నారు.పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న అఖిలమ్మ అడ్డగోలుగా బోటులకు అనుమతులు జారి చేయ్యడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రతి పక్షం పార్టీ వైసీపీ నాయకులు చెబుతున్నారు.