పార్టీలో పలుకుబడి ఉన్న నేతగా అందరికీ చెప్పుకుంటాడు. కానీ, పార్టీ కోసం నయా పైసా పనిచేయడు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడు. కానీ, సర్కార్‌కు ఏ స్థాయిలోనూ సాయపడడు. ఆయన మరెవరో కాదు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్. అధినేత అండ ఉందని చెప్పుకుంటూ నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతకు నేడు గడ్డుకాలం నడుస్తోంది. అంతేకాదు కాలం కలిసి రాకపోవడంతో కాళ్లబేరానికి వస్తున్నాడు.
కడప జిల్లాలలో ఇన్నాళ్లు ఆయన చేసిన పెత్తనానికి పార్టీ ధ్వంసం కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయన్ను పక్కన పెట్టారు. పార్టీ పక్కన పెట్టినా.. పంతం నెగ్గించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. సీఎం రమేష్ ఏపీలో సీఎం తరువాత నేనే అని చెప్పుకు తిరిగే కడప జిల్లా నేత, 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చెలరేగాడు. పార్టీలో సీనియర్లను లెక్క చేయకుండా ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చాడు. అయితే, అదంతా గతం, ప్రస్తుతం ఆయనకు గడ్డుకాలం ఎదురవుతోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరిన తరువాత పరిస్థితులు మారాయి.
కడప జిల్లా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై బీటెక్ రవిని గెలిపించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఎమ్మెల్సీ గెలుపుతో ఆదినారాయణరెడ్డి కృషిని గుర్తించిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఆదినారాయణరెడ్డి మంత్రి అయిన తరువాత సీఎం ర మేష్ ఆధిపత్యం తగ్గింది. మొన్నటి వరకు సీఎం రమేష్ జిల్లాలోని ప్రతీ వ్యవహారంలో జోక్య చేసుకునే వారు. ప్రతీ దానికి నేనున్నానంటూ తన స్థాయికి తగని పనుల్లోనూ చేయి పెట్టేవారాయన. ప్రతీ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జులు ఉన్నా అన్నింటిలోనూ వేలుపెట్టి కడపలో సీనియర్ నేతలకు వ్యతిరేక వర్గాలను ప్రోత్సహించారు. పులివెందులలో సీనియర్ నేత సతీష్‌రెడ్డికి వ్యతిరేకంగా రామ్‌గోపాల్‌రెడ్డిని ప్రోత్సహించారు.
పులివెందుల ప్రాంతానికి చెందిన బీటెక్ రవిని ప్రోత్సహించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడం ద్వారా సతీష్ ప్రాధాన్యతను తగ్గించారు. అప్పట్లో సతీష్‌రెడ్డికి చెప్పకుండా పులివెందులలో కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకంగా ఫ్లెక్సీలను వేసుకుని ప్రచారం నిర్వహించడం వివాద స్పదంగా మారింది. పులివెందులతోపాటు బద్వేల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూర్, కడపలోనూ పార్టీలో ముఠాలను కట్టి పెంచి పోసించిన చరిత్ర సీఎం రమేష్ సొంతం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వరదరాజుల రెడ్డికి వ్యతిరేకంగా ముస్లిం నేత ముక్తియార్‌ను ప్రోత్సహించింది ఆయనే. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో చంద్రబాబు ఆదేశాలను సైతం భేఖాతరు చేసి ముక్తియార్‌ను ఛైర్మన్‌ను చేసేందుకు యత్నించి దారుణంగా విఫలమయ్యారు. సీనియర్ రమేష్ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రొద్దుటూరు నుంచి బరిలోకి దిగేందుకు ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు. రిత్విక్ ప్రాజెక్ట్ పేరిట నిర్మాణ సంస్థ నిర్వహిస్తున్నారు సీఎం రమేష్ ఈ సంస్థ 2014 ముందు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. వేలకోట్ల అప్పులతో సంస్థ యాజమన్యం ఎన్నో నష్టానలు చవిచూసింది.
అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో జూలు విదిల్చారు సీఎం రమేష్. కీలకమైన భారీ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా దక్కించుకున్నారు. రోడ్డు పనులు, ఇరిగేషన్ కాలువ పనులు, ఇతర ఎన్నో ప్రాజెక్ట్ పనులను దక్కంచుకున్నారు సీఎం రమేష్. ఈ మూడేళ్ల కాలంలో సీఎం రమేష్
ప్రభుత్వం నుంచి పొందిన కాంట్రాక్ట్‌లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. రాయలసీమలో అన్ని కీలక పనులు దక్కించుకున్నారు సీఎం రమేష్. మొత్తం 23 ప్రాజెక్టులు కాగా వీటి విలువ అక్షరాలా రూ.2960 కోట్ల రూపాయలు. అయితే, సీఎం రమేష్ టెండర్ల ద్వారా కొన్ని పనులు దక్కించుకోగా మరికొన్ని పనులు ఇతర సంస్థలతో కలిసి చేజిక్కించుకున్నారు. పనులు దక్కించుకోవడంపై ఉన్న శ్రద్ధ వాటిని పూర్తి చేయడంపై లేకుండా పోయింది.
దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామంటు చెప్పుకుంటున్న రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడా నత్తనడకన సాగుతున్నాయి. సీఎం పోలవరం స్థాయిలో రాయలసీమ ప్రాజెక్టులపై కూడా దృష్టిపెట్టి ఉంటే ఈ పాటికి సీఎం రమేష్ కంపెనీలు ఇంటిదారే. ఇప్పటి వరకు లక్ష్యానికి అనుగుణంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు. ఈ సంస్థల ఘోర వైఫల్యం ప్రభుత్వమెడకు చుట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
అధికార పార్టీకి చెందిన వ్యక్తి పేరిట రమేష్, రమేష్ కంపెనీ ప్రతినిధులు అధికారులపట్ల వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరు చెప్పినట్లు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు ఇరిగేషన్‌శాఖలో చర్చ నడుస్తోంది. కొందరి అధికారులపై ఏసీబీ రైడ్స్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో రమేష్ సంస్థకు వచ్చిన కాంట్రాక్ట్‌లు అంటేనే ఇరిగేషన్ అధికారులకు హడల్‌గా మారింది. ఓ పక్క పనులు చేయక, మరో పక్క సబ్ కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించకుండా.. నేను ఆడిందే ఆట.. నేను పాడిందే పాట అనే రీతిలో వ్యవహరిస్తున్నాడు టీడీపీ ఎంపీ సీఎం రమేష్.
నిత్యం పోలవరం గురించి మాట్లాడే ప్రభుత్వ పెద్దలు ఎంపీ సీఎం రమేష్, ఆయన భాగస్వామ్యంతో ఇతర సంస్థలు చేస్తున్న పనితీరుపై ఏం సమాధానం చెబుతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.