శాసనసభలో రైతులకు రూ. 8 వేల పెట్టుబడిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు సీఎం సూచించారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో తెలిపేందుకు వ్యవసాయం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. ఆ పాటలు ఉట్టిగ రాయలేదన్నారు. పల్లెల దుస్థితిపై కవులు పాటలు రాయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు సీఎం. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయ గతి ఏమైందన్న ఉద్దేశంతోనే పాటలు రాశారని తెలిపారు. పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే.. పాలమూరులో అనే పాటలు రాయాల్సి వచ్చిందన్నారు. పాలమూరు రైతులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని గుర్తు చేశారు. కరీంనగర్‌లో 65 శాతం వ్యవసాయం బోర్లపై ఆధారపడి ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు.
