చేనేత కార్మికుల సంక్షేమం కోసం నిరంతం శ్రమించే తెలంగాణ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని నేతన్నల కోసం తీసుకువచ్చింది. ఇప్పటికే నేతన్నల కోసం పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు చేనేత శాఖా మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ నెల 18 తేదిన వరంగల్ పట్టణంలో చేనేత కార్మికులకు “యార్న్ సబ్సీడి’’ పథకాన్ని ప్రారంభిస్తామని అయన తెలిపారు. ఈ కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తీసుకుంటున్న చర్యలపైన మంత్రి చేనేత శాఖాధికారులతో ఈ రోజు సమీక్ష నిర్వహించారు.
నూతన పథకం గురించి మంత్రి కేటీఆర్ వివరిస్తూ… ఈ పథకంలో భాగంగా చేనేత సహకార సంఘంలోని సొసైటీలు, కార్మికులు కొనుగోలు చేసే నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 20% సబ్సిడీని మాత్రమే ఇస్తుందన్నారు. అయితే..నేత కార్మికుల ఆదాయాన్ని పెంచే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు నూలు, సిల్క్, ఉన్ని, డై, రసాయనాల కొనుగోలుపై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీని 20% నుంచి 40% కి పెంచుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10% సబ్సిడీ కూడా ఎప్పటిలాగానే లభిస్తుందని మంత్రి కేటీఆర్ వివరించారు.
తాము ప్రవేశపెట్టిన ఈ నూతన పథకంతో చేనేత, అనుబంధ కార్మికులకు 35% అదనపు ఆదాయం లభిస్తుందని, ఆయా సొసైటీలకు 5% ఆదాయం సమకూరుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పథకం కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించామ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ర్టంలోని సూమారు 35 వేల చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు.