తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో తన సత్తా చాటుకోవాలని కలలు కన్న కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్‌ల పరంపర ఎదురువుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌పార్టీలో వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతులు ఉండవని, తనకూ, మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వనట్టే, రేవంత్‌రెడ్డికి కూడా పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఉండదని సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి రేవంత్ గాలి తీసేసిన సంగతి మరువక ముందే.. ఆ పార్టీ అధిష్టానమే నేరుగా రేవంత్ ను టేకిట్ ఈజీగా తీసుకుంది.
ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. దీనికి రేవంత్‌రెడ్డికి ఆహ్వానం లేదు. కేవలం పార్టీలోని కొందరు సీనియర్లు మాత్రమే పాల్గొన్నారు. దీంతో రేవంత్ ఆవేదనకు గురయ్యారని సమాచారం. పార్టీలో తాను ఎంతో శ్రమించాలని భావిస్తుంటే…ఈ విధంగా చేయడం సరైంది కాదని సన్నిహితులతో వాపోయినట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ ఆవేదన గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలుసుకొని ఆయనను బుజ్జగించారు.
గుజరాత్ ఎన్నికలు ఉన్నందున పూర్తిస్థాయిలో రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించలేకపోతున్నారని, పదవుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుంతియా సర్దిచెప్పారు. పార్టీలో సముచితస్థానం ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. మర్యాద పూర్వకంగానే రేవంత్‌తో కుంతియా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రేవంత్ ఇంట్లో జరగబోయే శుభకార్యానికి కుంతియాను ఆహ్వానించారని, ఆయన ఢిల్లీకి వెళ్తుండడం వల్లే శనివారం రేవంత్‌ను కుంతియా కలిసినట్టు చెబుతూ కాంగ్రెస్ పార్టీ కవరింగ్ చేసుకుంటోంది.