మన దేశంలో సంతాన నిరోధకంలో కండోమ్‌ల పాత్ర కేవలం 5 శాతమేనని గతంలో కొన్ని పరిశోధనలు తేల్చాయి. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని గమనిస్తే అది నిజం కాదేమో అనిపిస్తోంది. ఉచితంగా కండోమ్‌లు సరఫరా చేయడానికి ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ బెంగళూరు కేంద్రంగా ఆన్‌లైన్‌లో ఓ స్టోర్ తెరిచింది. అంతే ఏకంగా 69 రోజుల్లో 10 లక్షల కండోమ్‌లు ఆర్డర్ చేశారు మనోళ్లు. ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..ఏప్రిల్ 28న ఉచితంగా కండోమ్స్‌ను సరఫరా చేయడానికి ఆన్‌లైన్ స్టోర్ తెరిచారు. ఇప్పటి వరకు 9.56 లక్షల కండోమ్‌లు డెలివరీ చేశారు. వీటిలో 5.14 లక్షల కండోమ్‌లను సామాజిక సంస్థలు, ఎన్జీవోలకు సరఫరా చేశారు. మిగిలిన 4.41 లక్షల కండోమ్‌లను ప్రజలు వ్యక్తిగతంగా ఆర్డర్ చేశారు. వ్యక్తిగతంగా ఆర్డర్ చేసుకున్న వాళ్లలో ఢిల్లీ, కర్ణాటక నుంచే అత్యధికంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్ (HLL)తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్.. ఈ ఉచిత కండోమ్ సరఫరా కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయామని ఫౌండేషన్ ఇండియా ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వి. శ్యామ్ ప్రసాద్ చెప్పారు. ‘డిసెంబర్ వరకు 10 లక్షల స్టాక్ సరిపోతుందని మేం భావించాం. కానీ జులై మొదటి వారంలో స్టాక్ అయిపోయింది. మళ్లీ 20 లక్షలు ఆర్డర్ చేశాం. అవి నవంబర్ ఆఖరి వారంలో మాకు అందాయి. మరో 50 లక్షలు ఆర్డర్ చేశాం. ఆ స్టాక్ జనవరిలో రావొచ్చు’ అని ప్రసాద్ వివరించారు.