నటుడు వేణుమాధవ్‌కి ఈ మధ్య కాలంలో సినిమాలు ఏమీ లేవు. ఆ మధ్య నంద్యాల బై పోల్ ప్రచారంలో కనిపించి వెళ్లడమే హద్దు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ వేణుమాధవ్ వార్తల్లోకి వచ్చాడు. గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యాడు వేణుమాధవ్. ఏమిటీ విశేషం అంటే.. ‘ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..’ అని వేణుమాధవ్ మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించాడు.
అయితే అసలు కథ వేరే ఉందని సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వేణుమాధవ్ ఉత్సాహంతో ఉన్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా పేరున్న ఈయన.. తెలుగుదేశం ద్వారానే ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచే వేణుమాధవ్ పోటీ చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరఫున పెద్దగా హడావుడి చేసే వాళ్లు లేకుండా పోయారు.
రేవంత్ తో పాటు చాలా మంది పార్టీని వీడటంతో కొంత ఖాళీ కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేణుమాధవ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడని.. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ పరిధిలో లేదా.. తన సొంత జిల్లా నల్లగొండలో టీడీపీ తరఫున ఏదో ఒక నియోజకవర్గం నుంచి వేణుమాధవ్ టికెట్ ను ఆశిస్తున్నాడని సమాచారం. అందుకే బాబును కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది.