రివ్యూ : డిటెక్టివ్
బ్యానర్ : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
తారాగణం: విశాల్,ప్రసన్న,కె.భాగ్యరాజ్,ఆండ్రియా,అను ఇమ్మాన్యుయేల్,విజయ్ రాయ్, సిమ్రన్.
సంగీతం : అరోల్ కోరెల్లి
ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు
కూర్పు: ఎన్. అరుణ్‌కుమార్
ఛాయాగ్రహణం: కార్తీక్ వెంకట్‌రామన్
నిర్మాత: విశాల్
కథ, కథనం, దర్శకత్వం: మిస్కిన్
టాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డ్ల వర్షం కురిపించిన ‘పందెంకోడి’లాంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకొన్నాడు ప్రముఖ హీరో విశాల్. నాటి నుండి నేటివరకు అతని సినిమాలు ఇక్కడ విడుదలవుతున్నాయి.అందులో కొన్ని సినిమాలు విజయం సాధించాయి కూడా. మాస్, కమర్షియల్ కథలతో పాటు, వైవిధ్యభరిత స్క్రిప్టుల్ని ఎంచుకొంటూ – తన విలక్షణత చూపించుకొంటూ వస్తున్నాడు. ‘డిటెక్టివ్’ కూడా అలాంటి కథే! మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళనాట ‘తుప్పరివాలన్’గా మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు తెలుగులోనూ విడుదలైంది. మరి… ఈ ‘డిటెక్టివ్’ కథేంటి? అతను పరిశోధించిన విషయమేంటి?.
అద్వైత భూషణ్ (విశాల్) ఒక ప్రైవేట్ డిటెక్టివ్. మను (ప్రసన్న) తన స్నేహితుడు కమ్ అసిస్టెంట్. పోలీసులకు సైతం లొంగని కొన్ని కేసుల్ని అద్వైత పరిష్కరిస్తుంటాడు. అందులో భాగంగా ఒకసారి ‘నా కుక్కపిల్లని ఎవరో చంపేశారు అంకుల్… వాళ్లెవరో కనిపెట్టండి’ అంటూ ఒక బాబు అద్వైత దగ్గరకు వస్తాడు. అతని అమాయకత్వం, కుక్కపిల్లపై తనకున్న ప్రేమ చూసి – ఈ కేసు ఒప్పుకొంటాడు. కుక్కపిల్లని ఎవరు చంపారు? అనే విషయాన్ని కనుక్కొంటూ వెళ్తుంటే… అద్వైతకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ప్రమాదాలుగా భ్రమింపచేసిన కొన్ని హత్యలకు ఒక ముఠా కారణమని గ్రహిస్తాడు. ఆ హత్యలెవరు చేశారు? వాళ్లని అద్వైత ఎలా పట్టుకొన్నాడు? అనేదే ఈ మూవీ అసలు కథ.
ప్రస్తుత రోజుల్లో ఇలాంటి కథలు టాలీవుడ్ సినిమా అభిమానులకు కొత్త . ఒక నేర పరిశోధన నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ మూవీ ఆసాంతం ఒక డిటెక్టివ్ నవలనను చదువుతున్నట్లు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. తరవాత ఏం జరగబోతోంది? అనే ఉత్కంఠను కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఒక కుక్కపిల్ల కేసు, దాని చుట్టూ అల్లుకొన్న హత్యలు.. ఒక్కో ఎపిసోడ్ గడుస్తున్న కొద్దీ… కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం, కథానాయకుడికి సవాల్‌గా మారడం ఇవన్నీ ఆకట్టుకొనే అంశాలే. దాన్ని దర్శకుడు నడిపించిన విధానం కూడా నచ్చుతుంది. టైటిల్స్ పడిన కాసేపటికే ఇదోదే కొత్త సినిమాలానే ఉందే అనే నిర్ణయానికి వస్తాడు ప్రేక్షకుడు. దానికి తగ్గట్టు ప్రతీ సన్నివేశాన్ని పకడ్బందీ స్క్రీన్ ప్లేతో నడిపి దర్శకుడు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తాడు. సైన్స్, ఇంజినీరింగ్ లాంటి సబ్జెక్టులు తెలిసినవాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ విషయాలపై తగిన అవగాహన లేనివాళ్లకు మాత్రం గందరగోళంగా ఉంటుంది. హత్యలు ఎవరు చేశారు, ఎందుకోసం అనేది ఓ పాత్రతో చెప్పించారు. ఆ డైలాగుల్లో ఏది మిస్ అయినా మరింత గందరగోళంగా ఉంటుంది. కథానాయిక (అను ఇమ్మాన్యుయేల్)ది చాలా చిన్న పాత్ర. ఈ మాత్రం దానికి హీరోయిన్ ఎందుకు అనిపిస్తుంది. కానీ… ఆ పాత్రని ముగించేటప్పుడు హీరోకి కీలకమైన క్లూ దొరికేలా చేశాడు దర్శకుడు. ఇలాంటి ఎపిసోడ్లలో మిస్కిన్ పనితనం అర్థం అవుతుంది. థ్రిల్లర్ జోనర్లను, డిటెక్టివ్ నవలలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది.
హీరో విశాల్ కి ఇది కొత్త పాత్ర. చాలా బాగా చేశాడు. తన నటన కూడా నచ్చుతుంది. అను ఇమ్మాన్యుయేల్‌ది చిన్న పాత్రేఅయిన కానీ చాలా అమాయకంగా కనిపించింది. అద్వైత స్నేహితుడిగా ప్రసన్న పాత్ర గుర్తుండిపోతుంది. ఆండ్రియా ఒక మినీ విలన్‌గా నటించింది. మిగిలిన వారంతా తమిళ నటులే. వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారు. టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.ఈ మూవీలో పాటల్లేవు. కానీ నేపథ్య సంగీతం బాగా కుదిరింది. డిటెక్టివ్ సినిమా చూస్తున్నామన్న మూడ్ ని నేపథ్య సంగీతం బాగా క్రియేట్ చేసింది. కథ, స్క్రీన్‌ప్లే విభాగాల్లో మిస్కిన్ ప్రతిభ కనిపిస్తుంది. డబ్బింగ్ సినిమా అయినా కానీ ఇక్కడి వారికీ ఆ భావన రాదు. అచ్చం తెలుగు సినిమాలానే అనిపిస్తుంది.
- బలాలు
+ కథ, స్క్రీన్‌ప్లే
+ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు
+ నేపథ్య సంగీతం
- బలహీనతలు
– ఒక జోనర్‌కే పరిమితం అవ్వడం
# రేటింగ్ : 2.25/5
# దరువు పంచ్ లైన్ : టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేయనున్న ‘డిటెక్టివ్’…