తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాశ్వతంగా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా తాగునీటి సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తులో విశ్వనగరంగా ఎదగాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నగర శివార్లలో రెండు రిజర్వాయర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. శామీర్‌పేట మండలం కేశవాపురంలో 10 టీఎంసీలతో ఒక రిజర్వాయర్, చౌటుప్పల్ వద్ద 10 టీఎంసీలతో మరో రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. త్వరలో రిజర్వాయర్ కోసం టెండర్లు పిలిచి పనులు చేపడుతామన్నారు. గోదావరి, కృష్ణా నీటిని అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. గండీపేట, ఉస్మాన్‌సాగర్ చెరువు ఆక్రమణలకు గురైంది. నాలాలపై ఆక్రమణలు తొలగించి పూర్వ వైభవానికి కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
