వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకి బ్రేక్ పడింది. అయితే ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. అసలు విషయం ఏంటంటే జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో ఈ శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. ఇక పాదయాత్రలో భాగంగా జగన్ నాల్గవరోజు 11 కిలోమీటర్ల మేరకు జగన్ నడిచారు. తాను ఏడు నెలలు 3000కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో పాదయాత్రలో ఉన్నప్పటికీ జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
జగన్ ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత నిన్న రాత్రే జగన్ హైదరాబాద్ బయలు దేరి వచ్చారు. జగన్ కు వెన్నునొప్పి రావడంతో వైద్యుల సూచన మేరకు నడుముకు బెల్టు పెట్టుకుని పాదయాత్రచేస్తున్నారు. జగన్ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి కోర్టు పనులకు హాజరైనా అక్కడే ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొనే వారు ఉండాల్సి ఉంటుంది. తిరిగి జగన్ శుక్రవారం రాత్రికి పాదయాత్ర నిలిపేసిన ప్రాంతానికి చేరుకుంటారు. శుక్రవారం రాత్రికి అక్కడే బసచేస్తారని వైసీపీ నేతలు చెప్పారు. శనివారం నుంచి యధావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుంది. జగన్ నాలుగురోజుల్లో 50 కిలోమీటర్ల మేర పాదయాత్రచేశారు.