రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌పీర్ దర్గాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా జహంగీర్‌పీర్ దర్గాను దర్శించుకుని.. పూల ఛాదర్ సమర్పించి సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడే జహంగీర్ పీర్ దర్గా వద్ద మొక్కుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.. అనంతరం సీఎం మాట్లాడుతూ జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దర్గా చుట్టుపక్కల ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు ఇస్తామని వెల్లడించారు. తండాలకు, చిన్న చిన్న గ్రామాలకు రూ.5లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తానని సీఎం ప్రకటించారు. దర్గా వద్ద 100 ఎకరాల్లో యాత్రికుల కోసం విశ్రాంతి గదులు నిర్మిస్తామన్నారు. . ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, వినోద్, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
