దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్ గ్యాంగ్ రేప్.. అసలు అత్యాచారమే కాదట. అంగీకారంతో జరిగిన సెక్స్ అట. ప్రాథమిక వైద్య నివేదికలో డాక్టర్లు ఇదే చెప్పారు. 19 ఏళ్ల యువతి.. అందులోనూ సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఉన్నత విద్యావంతురాలు.. ఆమెను బలవంతంగా లెక్కెళ్లి, చేతులను తాళ్లతో వెనక్కి కట్టి, బట్టలు చించి, సిగరెట్లు తాగుతూ నలుగురు వ్యక్తులు మూడు గంటల పాటు ఒకరి తర్వాత ఒకరు పశువాంఛ తీర్చుకుంటూ.. అత్యాచారం చేస్తే.. ఇప్పుడు అది రేప్ కాదంటూ రిపోర్టు ఇచ్చి వైద్యాధికారులు మరోసారి ఆమెను అత్యాచారం చేశారు. ఘటన జరిగిన తర్వాత ఆదుకోమంటూ ఆశ్రయిస్తే.. సినిమా కథలు చెప్పొదంటూ నిర్లక్ష్యపు పోలీసులు ఇప్పటికే ఆమెను ఓసారి అత్యాచారం చేశారు.
అంత రాక్షసంగా ఆమెపై విరుచుకుపడి కిరాతకానికి ఒడిగడితే.. ‘అంగీకార శృంగార చర్య’ ఎలా అవుతుందని బాధిత యువతి బంధువులు, ప్రజలు ప్రశ్నించడంతో అది గ్యాంగ్ రేపే అంటూ వైద్యాధికారులు మరో నివేదిక ఇవ్వడం గమనార్హం. తనపై అంత దారుణం జరిగిన తర్వాత కూడా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శంచిన ఆ యువతికి ఇది తీరని అవమానం. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
బాధితురాలి తల్లిదండ్రులిద్దరూ పోలీసు శాఖలో ఉన్నతోద్యోగులై ఉండగానే ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటే.. ఇక సామాన్య కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్లకు దిక్కెవరు? మృగాళ్లలా రెచ్చిపోతున్న కామాంధులను అడ్డుకునేదెవరు?