ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము.
కానీ స్పీకర్ తమను పట్టించుకోలేదని ఆయన అన్నారు. అమృత హస్తం పథకంపై బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి మెజారిటీ నిధుల్ని ప్రధాని మోదీ ఇస్తున్నారనే విషయాన్ని సభలో చెప్పుకునే అవకాశం కూడా తమకు లేకుండా పోయిందని ఆయన వాపోయారు.
అసెంబ్లీలో టీడీపీ నేతల సొంత భజనే కొనసాగుతోందని… భజన ఒక మోస్తరు వరకు ఉంటే వినసొంపుగా ఉంటుందని, ఇది శ్రుతి మించితే చెవి నొప్పులు వస్తాయని ఆయన అన్నారు.